PNVTV:

 ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే 62 మంది ప్రయాణీకులతో నట్టనడి సంద్రంలో మునిగిపోయిన ఇండోనేషియా విమాన ప్రమాద ఘటన మరో మారు ఆ దేశ వైమానిక పరిశ్రమ భద్రతను చర్చనీయాంశంగా మార్చింది. నిజానికి అసలెందుకు ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయనే ప్రశ్నను ఈ ప్రమాదం లేవనెత్తింది. ఆసియాలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇండోనేషియా రికార్డులు అత్యంత దారుణంగా ఉన్నాయి. 1945 నుంచి ఏ ఇతర దేశాల్లో జరగనన్ని పౌర విమాన ప్రమాదాలు ఇండోనేషియాలోనే జరిగాయి. గతంలో జరిగిన ప్రమాదాలన్నీ పైలెట్‌ శిక్షణా లోపంతో జరిగాయి. లేదా సాంకేతిక లోపం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సమస్యలు, లేదంటే విమానాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల జరిగాయి. ఇటీవలి కాలంలో ఇండోనేషియా పౌర విమానయాన సంస్థ పరిస్థితి మెరుగైందని నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ తాజా ఘటన ఇండోనేషియా వైమానిక సంస్థ పర్యవేక్షణ, నియంత్రణలోని లోపాలను పట్టిచూపుతోంది. ఇండోనేషియాలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి కారణమేమిటి అనేదే ఇప్పుడు సర్వత్రా వినపడుతోన్న ప్రశ్న. అయితే దీనికి ఆర్థిక, సామాజిక, భౌగోళిక సమస్యలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 1990 చివర్లో దశాబ్దాల నిరంకుశత్వం తరువాత సుహార్తో ప్రభుత్వం పడిపోయిన తరువాత ప్రారంభంలో విమానయాన సంస్థ బాగా అభివృద్ధిపథంలో నడిచింది. అయితే ఆ తరువాత ఈ రంగంలో శ్రద్ధ లోపించింది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాలు నాణ్యమైన, విమానయానానికి అనుకూలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేనప్పటికీ, తక్కువ ధరల్లోనే ప్రయాణీకులను తీసుకెళ్ళే వైమానిక వ్యవస్థ దేశంలో సర్వసాధారణ రవాణా వ్యవస్థగా మారింది.  వైమానిక భద్రతా నెట్‌వర్క్‌ గణాంకాలను బట్టి ఇండోనేషియాలో 104 పౌర విమానయాన ప్రమాదాలు జరిగాయి. 1945 నుంచి ఇప్పటి వరకు 13,00 మంది పౌరులు మరణించారు. ఏషియాలోనే విమానయానాల్లో అత్యంత ప్రమాదకర దేశంగా ఇండోనేషియాని భావిస్తున్నారు.

అంతర్జాలంలో మరియు కొన్ని వార్త చానెల్స్ లో దొరికిన సమాచారం ప్రకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *