PNVTV

రూ.150కోట్ల‌తో నాలుగు లేన్లుగా అమ‌రావ‌తి క‌ర‌క‌ట్ట రోడ్డు విస్త‌ర‌ణ‌

*అమ‌రావ‌తి‌*

విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోమ‌వారం సమీక్ష నిర్వ‌హించారు. పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ పి.లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు కార్య‌క్ర‌మానికి హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ విశాఖపట్నంలోని సముద్ర తీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై సమీక్ష నిర్వ‌హించారు. ఇదే భూమిని లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ళ లీజ్‌కు కట్టబెట్టిన గత ప్రభుత్వం క‌ట్ట‌బెట్టింద‌న్నారు. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై సీఎం సమీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ వివ‌రాలు అందించింది. కమర్షియల్‌ ప్లాజా, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి సుమారు రూ.1450కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్‌బీసీసీ వివ‌రించింది. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష జ‌రిపారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనపై వివరాలు అందించిన అధికారులు ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ సంద‌ర్భంగా రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి రోడ్డు కీలకంగా మారుతుందని వ్యాఖ్యానించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయాలన్న సీఎం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును మెయిన్‌ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తిచేయాలని, హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్ట్‌ను త్వరిత‌గ‌తిన పూర్తిచేయాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తిచేయాలని సీఎం జ‌గన్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *