‘‘కార్యకర్తలకు మీరేం చేశారు? సీనియర్లు అని చెప్పుకునే వారు మాకొద్దు.. ఎన్నికల్లో ఎవరు పట్టించుకోలేదు..!’’ గురువారం కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట ఆ పార్టీ కార్యకర్తల నిర్వేదం ఇదీ. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడుపల్లె, కుప్పంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైనా ఆయన తేరుకుని ‘‘పొరపాటు జరిగింది.. మీరు ఎన్నో త్యాగాలు చేశారు.. మీకోసం ఆలోచించి ఉంటే బాగుండేది.. మిమ్మల్ని విస్మరించా. ఇకపై మీ కోసం 25% సమయం కేటాయిస్తా.. మీరంతా చెప్పినట్లు వింటా..’’ అంటూ బుజ్జగించారు.తాను రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు పనిచేశానని, అయితే కార్యకర్తల కోసం సమయం కేటాయించలేకపోయానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేశారని, నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చోటా మోటా నాయకులు ఎగిరి పడుతున్నారని, చిన్న కాలువను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాను పులివెందులకు నీళ్లిస్తే అక్కడ ప్రజలు తనకు ఓటు వేశారన్నారు. ఈ ప్రభుత్వం కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *